Sunday 6 December 2015

సంద్రం




||సంద్రం॥
సంద్రం ముందు ఉంటే
నే చిన్నపిల్లాడ్ని అయినట్టే
సంద్రం అంటే ఏంటి
నేలపై ఉన్న నింగే కద
ఆ నింగిని ఈ నేలపై అందుకున్న క్షణాలు
నాకెప్పుడు ఆనందపు అణువులు వెల్లివిరిసినట్టే
ఆకాశానికి మబ్బులు వేలాడినట్టు
సముద్రానికి నావలు వేలాడుతుంటాయి
మబ్బుల వలె పడవల కదలికలు
నాలో రేపెను ఎన్నో కవనాలు
ఒక్కో క్షణం అనిపిస్తుంది
నీ తీరంలో రాయిని అవ్వాలని
నిరంతరం తనలో తడిసి మురిసిపోవాలని
మా మధ్య కూడా కొన్ని వైరాలు
తీరాలతొ తియ్యని తగాథాలు
ఇసుకల్లో నా గురుతులు లేనపుడల్లా
గాలి కూడా నాపై వాలిపోతూ
ఏవేవో మాటలు నిశ్శబ్దంగా పలుకుతుంటుంది
మేం సరదాగా మాట్లాడుకుంటున్నపుడు అడిగాను
నీలో ఈ ఉప్పటి హృదయం ఎందుకని?
నీ కన్నీటిని మింగి
నీలో నా ఆనందాన్ని పొందడం కోసమే
అన్న మాటలు విన్నపుడు
మా బంధం ఇంకా పెరిగింది
ఏదో అందం మమ్మల్ని అలుముకుంది
నింగి రంగును ఒళ్ళంతా పూసేసుకొని ఉంటుంది
తీరా తనతో ప్రయాణించినపుడు వర్ణం మాయమవుతుంది
అవాక్కయ్యి చూస్తుండగా
తన వర్ణాన్ని నా మనస్సుకు అలికేసి వెళ్ళిపోతుంది
ఇంకొంత రంగు తీసుకురావడానికి...

3/5/15

పేదకవి







||పేదకవి||
భారమైన పాదాల్ని చేతుల్లోకి తీసుకొని సాగిపోతుంటా
దారి పొడవున వేల ధాతువుల్ని ఏరుకుంటూ బాటసారి అవ్వాలని
జారిపోయే కాలాన్ని రెప్పల మధ్య బంధించేందుకు ప్రయత్నిస్తూ ఓడిపోతుంటా
కొన్ని భావాలకు పురుడుపోసే పనికి పూనుకుంటూ
అక్కడ గర్భంలో ఉమ్మనీటికి, నుదుటిపై కారే చెమట చుక్కకి భేదం లేదు
రాలిపోయే ఆకుల్లో
వాడిపోయే పువ్వుల్లో
చీమలదండుల్లో
నత్తల గుల్లలో
గొంగళి నడకల్లో
గుళక రాళ్ళల్లో
కవిత్వాన్ని వెర్రిగా వెతికేస్తుంటా
శూన్యం నుండి వచ్చే కొన్ని నిరాశలు నను చుట్టుముట్టి వెర్రివాడ్ని చేశాయి మరి
నిరాశలో కూరుకుపోయి కుప్పకూలిన నన్ను
నాచుపడ్డ ఓ గట్టు ఆధారమై ఆదుకుంది
ఆ నాచుని పరుచుకున్న గట్టులో కూడా కవిత్వం ఉంటుందని తెలుసుకోలేకపోయా
హహహ నేను వెర్రివాడ్నే కద
దూరాన విర్రవీగే సూర్యుడికి తెలుసో లేదో
ఎడారి ఇసుక రేణువు మండే గుణం
ఆకసాన తేలే మబ్బుకి తెలుసో లేదో
ఎండిన నీటి ప్రసవ వేదనపు ఆర్తనాదం
ఇంతకీ నా పయనానికి తెలుసో లేదో
నా అడుగులకు అంటుకున్న మట్టిలో కూడా కవిత్వం ఉంటుందని
బహుశా ఆఖరి శ్వాసలో తెలుసుకుంటానేమో
కాగితమే ఓ కవిత్వమని

8/7/15

మాసిన బాల్యం






|| మాసిన బాల్యం ||
కొన్ని చిట్లిన బాల్యాలు
మసి పూసుకున్న మనసులు మధ్య
"అరెయ్ చోటూ" అని పిలవబడుతుంటాయి
కాఫీకప్పుకి
చెత్త కుప్పకి
ట్రాఫిక్ సిగ్నల్ కి వేలాడుతూ
అలసిన నవ్వుల్ని ఎండిన డొక్కల్లో దాచేసుకుంటూ
పేవ్మెంట్ల పై పెరిగే పసితనాలు
మనిషితనం మరచిన మసితనాల మధ్య చితిమంటలై చివరాఖరికి వెలుగుతారు
నలిపివేయబడ్డ కాగితపు బతుకులు
మనుషులు విసిరిన విస్తరి మెతుకులు
వీళ్ళ జీవితాల్ని అద్దం పడతాయి
వీళ్ళ బాల్యాన్ని ప్రపంచపు 70mm స్క్రీన్ పై తీరుబడిగా చూసే మోర్ఫింగ్ మానవత్వాలెన్నో
మానవత్వాన్ని మన ముందు ముఖాల్లో వెతుక్కోవడమే మానవత్వం అనుకుంటూ
బతికేస్తున్నా సమాజమా
నీకో సలాం

12/7/15

పాదం





||పాదం||
నన్ను చేర్చుకోని గ్రహంవైపు పరుగుదీసి
సమస్తాన్ని సైతం కలం చేసి
అక్షరాల్లా జీవిస్తుంటా
ఎవరూ లేని ఆ అనాథ మట్టిలో బూజుపట్టిన ఓ ఆధారాన్ని వెతుక్కుని
నా రెండువేళ్ళ మధ్య సిగరెట్ పీక రాసే
పొగ కవిత్వాన్ని అనువదిస్తూ సాగిపోతాను
తెల్లటి పొగ నడువంపులు
నా కవాటాల్లో చేరి ఉక్కిరిబిక్కిరి చేసి
కవిత్వాన్ని రాయిస్తుంటాయి మరి
అక్కడో సాలీడు అల్లిన గూడు నా కాగితంలో కడతాను
కానీ గూడులో చిక్కుకున్న చీమ ఆర్తనాథాలను కాగితంపై అంటించలేను
బాధను స్వీకరించలేని మనిషిని కద
రెండు సిరా చుక్కల్లో చూస్కోనే నా పిచ్చి ఆనందాన్ని
ఆ ప్రాణి లో చూడలేనందుకు
రాల్చిన అశ్రుక్షణాలెన్నో
నా మది పాదాలు కదిలాయి ఇంకో గ్రహం వైపు
కలం కదలిక అక్కడితో ఆపేసి
కాగితాన్ని విసిరేసి

14/7/15

చెట్టు చాటు జీవితం




|| చెట్టు చాటు జీవితం ||
అంధకారపు అందాలను బజారున పరుచుకొని
చెట్టు చాటున చితికిపోయే జీవితాలను
ముఖాల్లో మోసే నవ్వులో జొప్పేసుకుంటూ
ఊరిలో బిడ్డ కోసం
ఊరి చివర అడ్డంగా బలైపోతుంటారు
ఆకలి ఆక్రందనల అలసటలో ఆటబొమ్మగా
తీగకు వేళాడుతూ
కామకళ్ళ కొరికివేతల్లో ముక్కలైపోతున్న శరీరాన్నీ ఏరుకుంటూ చీకటికి అంకితమౌతారు
నడిరేయి నొప్పిని పంటి బిగువున దాచుకొని
అశ్రురోదనల మధ్య అస్తమిస్తూ రాత్రిలో
ఉదయిస్తారు
ఈగతనపు మగమృగాల కింద
మాంసపు ముద్దలై నలిగిపొతూ
బానిసత్వపు బిరుదులు పొందుతారు
చీర మాటున కార్చే అవయవకన్నీళ్ళకు
పరిమళపు పౌడర్ అద్దుకుని
అద్దెకు సిద్దమవుతారు
గమ్యం లేని గమనాల్లో
గతుకుల బతుకులకు అత్తరు అతుకులు
అతుక్కుంటూ
బాధలను మింగి భంగిమలకు లొంగి
బ్రతుకు భారాన్ని దేహల సాక్షిగా మోస్తూ
కన్నీటి జడిలో ఈదుతూ మగ్గిపోతారు
వాళ్ళను చీకట్లో మాత్రమే గుర్తించే లోకమా
రెండు కన్నీటి చుక్కలైనా రాల్చి నీ మానవత్వానికి ఉన్న మసిని కడిగేసుకో

19/7/15

దోస్తీ







|| దోస్తీ ||
ప్రేమను పరిచయం చేసేది కుటుంబం
ప్రపంచాన్ని పరిచయం చేసేది స్నేహం
ఇలా అనిపిస్తుంటుంది మరి
ప్రకృతి పంచే ఈ అవ్యాజమైన బంధాన్ని
గుప్పెట్లో దాయలేక కొంత స్నేహన్ని
ఇంకొంతమందికి పంచుతూ సాగిపోతుంటాను
ప్రతీ అణువులో స్నేహం చిగురించడం నాకు ఓ వింతగానే అనిపించేది..
నాకు నేర్పిస్తున్న పుస్తకం
నన్ను నడిపిస్తున్న దారి
గలగల గుసగుసలాడే చెరువు
పక్కనే నన్ను స్పర్శించాలనుకునే గట్టు
నను శృతి చేసే గాలికెరటాల గమకాలు
పైన చెట్టుకి కాసిన సూరీడు
కింద మట్టితో మాటాడుతున్న నేరేడు
ఆకాశానికి అందాన్ని అద్దుతున్న కొంగలమాల
నా చేతిలో సడి చేయలేని రాయి
ఇలా పరిచయం లేని స్నేహలు
ఎన్నో అనుభూతుల్ని పలకరింపజేసాయి
నాకిప్పటికి గుర్తు
నాతో ఆడుకున్న ఉడుత
కొన్ని క్షణాల స్నేహన్నిచ్చి వెళ్ళిపొయింది
ఆ ఙ్ఞాపకాలు ఇప్పటికి గిచ్చుతూనే ఉంటాయి..
నేను రోజు చూసే అద్దం
కొంత నిశ్శబ్దం
నను నడిపించే కలం
నాతో ప్రతినిత్యం స్నేహిస్తుంటాయి..
ఇంకొంత స్నేహం కావాలి నాకు

2/8/15

"ఆజా"ద్



|| "ఆజా"ద్ ||
పచ్చివాసన కొడుతున్న డస్ట్ బిన్ దేహల
రక్తపు ముద్దల్లో పసిఆయువుకి స్వాతంత్రం
అత్తరు వీధుల్లో అణిగిపోతున్న ఆత్మలకు
శరీరాన్ని వదిలేయడం ఓ స్వాతంత్రం
నడిరోడ్డు "రేపు"ల రాజ్యాలను రక్తాలతో రచిస్తున్న మృగానుభావులకు ఓ స్వాతంత్రం
కళాశాల ఉరివేతల్లో కాళ్ళను
విడిచిన టేబుళ్ళకు ఓ స్వాతంత్రం
మనిషితత్వాన్ని విసిరేసిన మనిషికి
ఓ స్వాతంత్రం
జెండా ఊంఛా రహే హమారా మాటల్లో
జనతా నీచే రహే హమేషా నిజాల్లో
గవర్నమెంట్ గదుల్లో పంద్రాగష్టు పాటల్లో
రంగుల కాగితాల్లో చూసి మురిసిపోయే
సో కాల్డ్ స్వాతంత్రమిది
వెర్రితనపు చాక్లెట్ సంబరాలే ఇవి
మట్టితనంపై అంబరాన్నంటిన భక్తి కాదిది
అర్థరాత్రి నడిచే స్త్రీని స్వతంత్రానికి సింబాలిక్ గా చెప్పిన గాంధికి తెలియదు
"వస్తావా" అన్న కూతలుకు అది స్వతంత్రమవుతాదని
ఫ్రీడం ఇజ్ మై బర్త్ రైట్ అన్న స్లోగాన్కి తెలియదు
రేప్ ఇజ్ మై బర్త్ రైట్ అన్న నాలుకలకి
స్వతంత్రాన్నిస్తాయని
పొలిటికల్ పార్టీలకు ఓటేసి సీటుకి రూటేసి
అమాయక స్వార్థ మకుపి లే ఇస్తున్నారు స్వాతంత్రం
తమ్ముడూ మనది
టు బి కంటి"న్యూడ్" ఫ్రీడం రోయ్
అన్నయ్యలు మనది
కమింగ్ అప్ స్వతంత్రాలోయ్

15/8/15